ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు
పనాజీ, అక్టోబర్ 20: ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సోమవారం దీపావళి వేడుకలను నేవీ సిబ్బందితో కలిసి ప్రధాని మోదీ గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ ప్రేరణతో మన నావికాదళం ముందుకెళ్తోందన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్బర్ భారత్, మేడిన్ ఇండియా చూస్తున్నామని చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే చాలు.. శత్రువులకు నిద్ర కూడా పట్టదని తెలిపారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్.. పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు. అదే సమయంలో పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పరాక్రమం చూపిన త్రివిధ దళాలకు ఆయన సెల్యూట్ చేశారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.